మొబైల్స్ తయారీదారు రియల్‌మి ఇక స్మార్ట్‌టీవీల తయారీపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఆ కంపెనీ త్వరలో స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్ టీవీలు ఏప్రిల్ నెలలో విడుదల కానున్నట్లు తెలిపారు. ఇక ఆ టీవీలలో సౌండ్, పిక్చర్ క్వాలిటీలు అద్భుతంగా ఉంటాయని రియల్‌మి విడుదల చేసిన టీజర్‌ల ద్వారా మనకు తెలుస్తుంది. రియల్ సౌండ్, రియల్ డిజైన్ రియల్ క్వాలిటీ కాప్షన్‌తో రియల్‌మి ఇప్పటికే తన స్మార్ట్‌టీవీల టీజర్‌ను విడుదల చేసింది. దీన్ని రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ కూడా ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే రియల్‌మి టీవీలలో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలో ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.